గీసుకొండ: వడదెబ్బతో వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దౌడు కోమల(60) ఆదివారం మృతి చెందారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె కింద పడి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆమె కుమారుడు భరత్ తెలిపారు. కోమల 2019–2024 మధ్య కాలంలో ఎంపీటీసీగా పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోమల మృతిపై గ్రామస్తులు, పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి ..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో చెరువులో పడి అదే గ్రామానికి చెందిన అల్లం మహేశ్వర్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. కూలి పని చేసే మహేశ్యర్ ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వైపునకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి చెరువులో పడి నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.


