మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, అప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేస్తున్నారు.
పాఠశాలల పునఃప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా ప్రతీ విద్యార్థికి సమయానికి పుస్తకాలను అందజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జిల్లాకు 2,86,290 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కూడా పాఠ్యపుస్తకాలపై సీరియల్ నంబర్లు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల ఆధార్‌కార్డు నంబర్‌ను అనుసంధానం చేసుకుని, పుస్తకంపై ఉన్న సీరియల్ నంబర్‌ను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని, ఆధార్‌కార్డు, సీరియల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. అలాగే జూన్ 4నుంచి జూన్ 12వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున నిధులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు పంపిణీ..
జిల్లావ్యాప్తంగా 18 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,00090 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, ఆయా మండలాల ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా పాఠ్య పుస్తకాలు తరలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేస్తారు.
సకాలంలో విద్యార్థులకు అందజేస్తాం
ప్రభుత్వ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో నూతన అడ్మిషన్ల కోసం తమవంతు బాధ్యతగా తీసుకుని విద్యార్థులను చేర్పించాలి. ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రతీ మండలానికి పుస్తకాలను రవాణా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలను సకాలంలో అందజేస్తాం. ఇప్పటికే జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి.
– సత్యనారాయణమూర్తి,
జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాకు చేరిన 2,86,290 పాఠ్యపుస్తకాలు
73శాతం మాత్రమే రాక
ప్రభుత్వ పాఠశాలల్లో 1,00,090
మంది విద్యార్థులు
జూన్ 12న బడుల పునఃప్రారంభం
మండలం పాఠశాలలు విద్యార్థులు
బయ్యారం 84 4,089
చిన్నగూడూరు 13 1,126
దంతాలపల్లి 31 3,500
డోర్నకల్ 55 6,970
గంగారం 34 1,010
గార్ల 60 3,527
గూడూరు 93 5731
ఇనుగుర్తి 23 1,673
కేసముద్రం 67 6,801
కొత్తగూడ 61 3,611
కురవి 60 4,948
మానుకోట 140 23,782
మరిపెడ 84 9,276
నర్సింహులపేట 44 2,762
నెల్లికుదురు 54 3,288
పెద్దవంగర 31 2080
సీరోలు 27 1,724
తొర్రూరు 71 14,192
మొత్తం 1,032 1,00,090


