వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కొలుపుల శంకర్‌ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్‌ కేంద్రంలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, కాంటాలు ఆలస్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. లారీలు, గన్నీ సంచుల కొరత తీర్చి కొనుగోళ్ల వేగం పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అర్బన్‌ అధ్యక్షుడు పైండ్ల రాజేష్‌, నాయకులు నడిగడ్డ సందీప్‌, అలిసేరి రవిబాబు, మంగళపల్లి యాకయ్య, గంధం రాజు, సాయి ముఖేష్‌, విజయ్‌కుమార్‌, భరత్‌, నవీన్‌ పాల్గొన్నారు.

వీఆర్‌ఏ వారసుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా యాకయ్య

పెద్దవంగర: వీఆర్‌ఏ వారసుల సంఘం జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా మండలానికి చెందిన నీరటి యాకయ్య ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన ఆయన 10 ఏళ్లుగా వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివిధ మండలాల వీఆర్‌ఏల సమక్షంలో ఈ ఎన్నిక చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వీఆర్‌ఏ వారసుల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగాలు వచ్చే వరకు వీఆర్‌ఏ వారసుల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

గోదావరిలో

ప్రముఖులకు దారి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్‌లు రానున్నాయి. అక్కడే కంటెయినర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లు, జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్‌లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

15 చెక్‌పోస్టుల ఏర్పాటు

సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్‌వే అమలులోకి రావడంతో చెక్‌పోస్టుల వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి.

శివ కల్యాణ మండపంలో హోమాలు

ఈనెల 21నుంచి జూన్‌ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్‌ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement