● న్యాయ సేవల కేంద్రానికి పెరుగుతున్న దరఖాస్తులు
● సమస్యల పరిష్కారంతో
సీనియర్ సిటిజన్ల హర్షం
మహబూబాబాద్: జిల్లాలోని సీనియర్ సిటిజన్‌ల కోర్టు కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా న్యాయ సేవల కేంద్రంలో దరఖాస్తులు పెరుగుతున్నాయి. కాగా, సమస్యల పరిష్కారంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టరేట్‌లో న్యాయ సేవల కేంద్రం..
2025 నవంబర్ 24వ తేదీన కలెక్టరేట్‌లో న్యాయ సేవల కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సీనియర్ సిటిజన్‌ల నుంచి కోర్టు కేసుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు న్యాయ సేవల కేంద్రంలో పారా లీగల్ వలంటీరు అందుబాటులో ఉండి న్యాయ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐదు నెలల్లో కేంద్రానికి వందకుపై దరఖాస్తులు వచ్చాయి. తీసుకున్న దరఖాస్తుపై స్పందిస్తూ పూర్తి వివరాలు తీసుకుని ప్రభుత్వ న్యాయవాది ద్వారా నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధ దంపతుల మెయింటెనెన్స్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈమేరకు వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు.
నా కొడుకులు ఇబ్బంది పెడుతున్నారు..
నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున ఇచ్చాను. నాకు ఎకరం 10గంటల భూమి ఉంది. దానిని అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను సక్రమంగా చూసుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారు. కేసు వేసి న్యాయం చేయాలని అన్ని పత్రాలను కేంద్రంలో ఇచ్చాను. –బోనగిరి చిన్న రాములు, ఉప్పరపల్లి, కేసముద్రం


