● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
మహబూబాబాద్: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం విద్యావారోత్సవాల్లో భాగంగా పది తరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ రవీందర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే ఉన్నతస్థాయికి ఎదుగుతామని, సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. అంకితభావంతో పని చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్ నీరుటి హైమా, డీఐఈఓ మదార్ పాల్గొన్నారు.


