మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శ బి.విజయసారథి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో దిచక్రవాహనాలకు తాళ్లు కట్టి లాగడంతో పాటు రిక్షాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచి పేదలపై తీవ్రభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ దేఽశ ప్రజలపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్‌సారథి రెడ్డి, నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, పాండురంగాచారి, సాంబలక్ష్మి, ఉప్పలయ్య, శ్రావణ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.


