హన్మకొండ: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌లోకి వెళ్లేందుకు ఆప్షన్‌లు ఇచ్చిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టనున్నట్లు మార్గదర్శకాల్లో పొందుపరిచినా ఆచరణలో రాష్ట్ర ఇంధన శాఖ, టీజీ ఆర్‌పీడీసీఎల్ యాజమాన్యం వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆప్షన్ ఇచ్చిన అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీలోపు రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలు.. టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజనీర్లు, పర్సనల్ విభాగం అధికారులు, అకౌంట్స్ విభాగం అధికారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు రైతు డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్‌లో పొందుపరిచిన వివరాలు సరైనావా కాదా అని ఈ నెల 12న వెరిఫికేషన్ చేసి తుది జాబితాను ఆయా సర్కిల్‌లు ఆర్‌పీడీసీఎల్‌కు పంపాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 15న మాతృ సంస్థ నుంచి రిలీవ్ అయి 18న ఆర్‌పీడీసీఎల్‌లో రిపోర్టు చేయాలి. 19న ఆర్‌పీడీసీఎల్ పరిధిలో పోస్టింగ్‌లు ఇవ్వాలి. 25న పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. అయితే ఇప్పటి వరకు బదిలీ నియామకాలు చేపట్టలేదు. ఇది మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది.
బదిలీ నియామకాల అమలుపై మల్లగుల్లాలు..
బదిలీ నియామకాల అమలుపై ఇంధన శాఖ, టీజీఆర్‌పీడీసీఎల్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారిని పలు సందేహాల వెంటాడుతున్నాయి. ఇంజనీర్స్ అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి అసోసియేషన్‌లు, సంఘాలు తీసుకెళ్లాయి. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తుది నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి సమస్య తలెత్తకుండా బదిలీ నియామకాలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్‌పీడీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది.
పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు
వంటి అంశాలపై పీటముడి
రాష్ట్రంలో ప్రస్తుతమున్న నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి టీజీ ఆర్‌పీడీసీఎల్ ఆప్షన్‌లు కోరిన విషయం విధితమే. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చింది. నాలుగు విద్యుత్ సంస్థల నుంచి అధికారులు, ఉద్యోగులను ఏ నిష్పత్తిలో, ఏ కంపెనీ నుంచి ఎంత మంది చొప్పున తీసుకోవాలి? రిజర్వేషన్ రోస్టర్ అమలు... పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు వంటి అంశాలపై పీటముడి వీడడం లేదు. ఆప్షన్ ఇచ్చిన వారిలో రిజర్వేషన్ రోస్టర్ అమలు మేరకు ఆ కేటగిరీ ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలనే సందిగ్ధతలో ఇంధన శాఖ, టీజీ ఆర్‌పీడీసీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల నుంచి ఆప్షన్లు రావడంతో సీనియార్టీ లెక్కింపు కూడా సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో బదిలీ నియామకాల ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది. అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది.
ఆర్‌పీడీసీఎల్ వెళ్లడానికి ఈనెల 8న ఆప్షన్లు, 12న వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తి
13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా కాలయాపన
సాగుతున్న ప్రక్రియ..
బదిలీలపై పలు సందేహాలు
ఎటూ తేల్చుకోలేకపోతున్న
ఇంధన శాఖ, ఆర్‌పీడీసీఎల్
కొనసాగుతున్న అనిశ్చితి
ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు


