కేయూ క్యాంపస్: విద్య, వైద్యరంగాల్లోనూ కృత్రిమ మేధస్సు(ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సెనెట్‌హాల్‌లో రీజనల్ స్థాయి ఏఐ కాన్‌క్లేవ్ –2026 పై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధస్సు విద్య, వైద్యం, వ్యవసాయం, పాలన, తదితర రంగాల్లో విప్లవాత్మ మార్పులు తీసుకొస్తుందన్నారు. ముఖ్యంగా వ్యాధుల నివారణలో సీఎన్‌ఎన్, ఆర్‌ఎన్‌ఎన్ , ఎల్‌ఎస్‌టీఎం వంటి డిప్ లెర్నింగ్ విధానాలు కీలకంగా మారాయని తెలిపారు. ఏఐ వినియోగంలో నైతికత, పారదర్శకత, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి , కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్‌లో విస్తృత ఉద్యోగావకాశాలను సృష్టించనున్నదన్నారు. విద్యార్థులు , అధ్యాపకులు ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏఐ శక్తివంతమైన సాధనం..
ఈ సదస్సులో ప్రధానవక్తగా వరంగల్ నిట్ ఆచార్యుడు రామలింగస్వామి మాట్లాడుతూ ప్రగతిశీల తెలంగాణ కోసం విద్య, ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి చెందుతున్న సాంకేతక రంగాలను భవిష్యత్‌లో మలచడంలో కృత్రిమ మేధస్సు శక్తివంతమైన సాధనమన్నారు. కృత్రిమ మేధస్సు అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. బోధనను మరింత శక్తివంతంగా చేసే సాధనని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేయూ ఓఎస్‌డీ బి. వెంకట్రామ్‌రెడ్డి, కేయూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్. రమణ, కె. భిక్షాలు మాట్లాడారు.
కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం


