కేయూ క్యాంపస్: కళాకారులు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కాకతీయ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చేతన కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఎస్‌డీఎల్‌సీఈ గ్రౌండ్‌లో నిర్వహించిన కాకతీయ కళల జాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయులు ఆనాడు ప్రజలకు సుపరిపాలనతోపాటు కళలు, అద్భుతమైన శిల్పకళ, నృత్యాలు, సంగీతానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ముఖ్యంగా పేరిణీ నృత్యం కాకతీయుల కాలంలో విలసిల్లిన నృత్యప్రదర్శన అని గుర్తు చేశారు. కాకతీయల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులు నేటికీ ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో కాకతీయుల కళా జాతర నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. కళాకారులకు కళలపై అభిరుచి కలగాలంటే థియేటర్ ఆర్ట్స్ సబ్జెక్టుగా యూనివర్సిటీలో విభాగం ఏర్పాటుచేయాలని అందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయి పార్టీలో ఉన్నందున విభాగం ఏర్పాటు జరిగేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటుచేస్తే ఎంతో మంది కళాకారులు తయారవుతారన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు మాట్లాడుతూ.. కాకతీయు కాలంనాటి శిల్పకళ అద్భుతమైందన్నారు. కాగా పేరిణీ నృత్యంతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను అలరించాయి. బీజేపీ నాయకురాలు రావు పద్మ, జబర్దస్త్ ఫేమ్ వెంకీ, రాజమౌళి, లక్ష్మణాచారి, బోలేశావలి, చేతన కళావేదిక కన్వీనర్ నాగేశ్వర్‌రావు, బాధ్యులు శ్యామ్, దేవేందర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ సీతారాంనాయక్
కేయూలో ఘనంగా
కాకతీయ కళల జాతర
అలరించిన
సాంస్కృతిక కార్యక్రమాలు


