టీజీ ఆర్పీడీసీఎల్‌ ఏర్పాటు వేగిరం | - | Sakshi
Sakshi News home page

టీజీ ఆర్పీడీసీఎల్‌ ఏర్పాటు వేగిరం

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

హన్మకొండ: తెలంగాణ రైతు పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ పూర్తి స్థాయిలో ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత విద్యుత్‌ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన వారి నుంచి ఆప్షన్‌లు కోరగా ఈ నెల 8వ తేదీ నాటికి ఉద్యోగులు ఆప్షన్‌లు ఇచ్చారు. వీరికి బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది.

ఆస్తుల పంపిణీ వేగిరం

వ్యవసాయ సర్వీస్‌లు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌, సీవరేజ్‌ బోర్డు, మున్సిపల్‌ వాటర్‌ కనెక్షన్‌ విత్‌ సఫరేట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్వీస్‌లు టీజీ ఆర్పీడీసీఎల్‌లోకి వస్తాయి. ఈ మేరకు గృహ సర్వీస్‌లు వ్యవసాయ సర్వీస్‌లు కలిసి ఉన్న విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను వేరు చేయడంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియను విద్యుత్‌ పంపిణీ కంపెనీలు వేగిరం చేశాయి. లైసెన్స్‌ జారీ కావడానికి ముందే ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలని టీజీ ఆర్పీడీసీఎల్‌, టీజీ ఎన్పీడీసీఎల్‌, టీజీ ఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆస్తుల పంపిణీలో భాగంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టారు. సంబంధత సెక్షన్‌ ఏఈతోపాటు, సెక్షన్‌లోని ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఉద్యోగులు వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ల గుర్తింపు పనిలో బిజీ అయ్యారు.

ట్రాన్స్‌ఫార్మర్ల నమోదుకు ప్రత్యేక యాప్‌

టీజీ ఆర్పీడీసీఎల్‌కు బదిలీ అయ్యే విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు తెలిసింది. ఈ యాప్‌లో వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్‌ల ఫొటోలు ఆప్‌లోడ్‌ చేస్తారు. మూడు రకాల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఫ్లింత్‌తో సహా ట్రాన్స్‌ఫార్మర్‌ ఫొటో, ట్రాన్స్‌ఫార్మర్‌ ఎంబోసింగ్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ కంపెనీ నేం ప్లేట్‌ ఫొటోలు వేర్వేరుగా అప్‌లోడ్‌ చేయాలి. ఫీడర్‌ పేరు, ట్రాన్స్‌ఫార్మర్‌ కంపెనీ పేరు, ట్రాన్స్‌ఫార్మర్‌ నంబర్‌, కంపెనీ నంబర్‌, వ్యవసాయ సర్వీస్‌లు వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయంతోపాటు ఇతర సర్వీస్‌లు ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉంటే వీటిని వేరు చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత డిస్కంలదే. వ్యవసాయ సర్వీస్‌లు వేరు చేస్తూ ప్రత్యేకంగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌లన్ని టీజీ ఆర్పీడీసీఎల్‌కి వెళ్లనున్నాయి.

25వ తేదీ వరకు గడువు

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ, యాప్‌లో అప్‌లోడ్‌ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని మూడు డిస్కంల సీఎండీలు.. ఎస్‌ఈ, డీఈలు, ఏడీఈలకు సూచించారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్ణీత గడువులోగా చేయలేమని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్పీడీసీఎల్‌కు అప్షన్‌ కోరడంతో చాలా మంది మూడో డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్‌ ఇచ్చారు. వీరిని ఆ డిస్కంలోకి తీసుకుంటే మరింత ఉద్యోగుల కొరత ఏర్పడనుందని ఈ క్రమంలో గడువులోగా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ల గుర్తింపు, యాప్‌లో అప్‌లోడ్‌ ప్రక్రియ పూర్తి కాదని డివిజన్‌, సబ్‌ డివిజన్‌, సెక్షన్‌ స్థాయి అధికారులు చెబుతున్నారు. కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందన్నారు.

మొదలైన వ్యవసాయ

ట్రాన్స్‌ఫార్మర్ల గుర్తింపు

గృహ, వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల ప్రత్యేక ఏర్పాటు

ప్రత్యేక యాప్‌లో ఫొటో సహా నమోదు

ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ

Advertisement
 
Advertisement
Advertisement