హన్మకొండ కల్చరల్: కళలపై పరిశోధకులు, లోతైన అధ్యాయనం చేయాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ హంటర్ రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు నిర్వహించారు. వీసీ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర బాబు, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, ప్రజాపాలన నోడల్ అధికారి, విశ్వవిద్యాలయం ఆచార్యులు బి.హెచ్ పద్మప్రియ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజామనోహర్ బాబు మాట్లాడుతూ.. భాష, అలంకారాలు, పద ప్రయోగం, వాక్య నిర్మాణం వంటి అంశాలను వివరించారు. వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి జరుగుతోందని పరిశోధనా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆస్థిత్వాన్ని కాపాడే దిశగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. వీసీ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పరిశోధన పత్రాలను సమర్పించే పరిశోధక విద్యార్థులు నాణ్యమైన విషయ విజ్ఞానాన్ని సేకరించి భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. జానపద గిరిజన విజ్ఞాన పిఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మాట్లాడుతూ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లు పీఠానికి తగిన సదుపాయాలు కల్పించారని తెలిపారు. అంతకుముందు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిహీత డాక్టర్ ఎండీ రాజ్‌మహ్మద్ పీఠం లైబ్రరీకి 216 పుస్తకాలు ఉచితంగా అందజేయగా.. అతన్ని సన్మానించారు. విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేయగా.. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సదసుసలో కవుల రామాచంద్రమౌళి, వల్పపైడి, పరీక్షల నియంత్రణాధికారి ఆదిలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ రత్నశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ బాలోజినాయక్, ఏఆర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ అమీర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేష్, చూరేపలి రవికుమార్, అబ్బు గోపాల్‌రెడ్డి, గంపా సతీష్ పాల్గొన్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు
విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు
వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన
పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు


