మామునూరు: విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అధికారులు, పోలీసులు అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర టీజీఎస్పీ బెటాలియన్ల డీఐజీ వి.వి.రమణారెడ్డి సూచించారు. మామునూరులోని నాలుగో బెటాలియన్‌ను శుక్రవారం రమణారెడ్డి సందర్శించారు. బెటాలియన్ గేట్ వద్ద డీఐజీకి కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. అనంత రం పోలీసుల నుంచి డీఐజీ గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మెటార్ ట్రాన్స్‌ఫోర్ట్, యూనిట్ హాస్పటల్, పెట్రోల్ బంక్, క్వార్టర్ మాస్టర్ ఆఫీసులను తనిఖీ చేసి నిర్వాహణలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యానికి తావు లేకుండా విధి నిర్వాహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అమ్మవారిపేటలోని టీజీ ఎస్పీ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్‌ను ఆయన పరిశీలించారు. ఫైరింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, నూతన సాంకేతికతతో ఉపయోగించుకోవాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఏసీ మూర్తు జారెహమాన్, బాలయ్య, రాజేందర్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
టీజీ ఎస్పీ బెటాలియన్
డీఐజీ వి.వి రమణారెడ్డి
టీజీఎస్పీ బెటాలియన్ సందర్శన


