పర్వతగిరి: మామిడితోటలో కాయలు కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో బాలుడు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం సేట్‌రాంతండాకు చెందిన నేనావత్ సంతోష్(15) ఇటీవల పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇదిలాఉండగా.. అదేజిల్లా మద్దిరాల మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వర్‌రావు మామిడితోట లీజుకు తీసుకుని సంతోష్‌ను మామిడి కాయలు కోసేందుకు తీసుకొచ్చాడు. శుక్రవారం మామిడి కాయలు కోసే క్రమంలో 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి సంతోష్ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామిడితోట మధ్యలో నుంచి 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు తొలగించడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎల్‌సీ తీసుకోకుండా తోట యజమాని, కౌలుదారు మామిడి కాయలు కోయించడంతో బాలుడు మృతి చెందాడు.
బంధువుల ఆందోళన..
వర్ధన్నపేటలోని మార్చురీ వద్ద మృతుడి తల్లిదండ్రులు విజయ రాజు శోకసంద్రంలో మునిగిపోగా.. బంధువులు మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. తగిన న్యాయం చేస్తామని పర్వతగిరి సీఐ రాజగోపాల్ వారికి నచ్చజెప్పినా వారువినలేదు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. కాగా మృతుడికి అక్క రాజేశ్వరి, తల్లిదండ్రులు ఉన్నారు.
● మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదం
● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి


