కేసముద్రం: మక్కలను అమ్ముకుందామన్న రైతులకు కష్టం తప్పడం లేదు. లారీల కొరత ఉందంటూ కేసముద్రం మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల బంద్ చేసి, డ్రా పద్ధతిలో ఎంపికై న గ్రామాలవారీగా, రైతులు తమ మక్కలను 51కేజీల చొప్పున బస్తాల్లో మక్కలను నింపుకుని, వేబ్రిడ్జిపై ట్రాక్టర్‌లోడ్ తూకం వేసి తీసుకురావాలని ఈనెల 7న అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైతులు తమ ఇళ్ల వద్ద, వ్యవసాయ భూముల వద్ద బస్తాలను నింపిస్తూ కాంటాలు పెట్టిస్తున్నారు. కూలీలు దొరకకపోవడంతో రైతులే నింపుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మక్కబస్తాలను ట్రాక్టర్‌లో లోడ్ వేసుకుని వేబ్రిడ్జి వద్ద కాంటా పెట్టిస్తున్నారు. అయితే ఒక్కటే వేబ్రిడ్జికి కాంటా వేసేందుకు పర్మిషన్ ఇవ్వడంతో, జ్యోతిరావుపూలే సెంటర్ వరకు మక్క ట్రాక్టర్‌లు బారులుదీరుతున్నాయి. పైగా ఆన్‌లైన్‌లో బయోమెట్రిక్ కింద రైతులు వేలిముద్రల నమోదు, రైతుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ చేసేందుకుగాను, ఒక్కో రైతుకు 20నిమిషాలు పడుతుండటంతో కౌంటర్ వద్ద పడిగాపులు పడుతున్నారు. తీరా అన్‌లోడ్ చేయాలంటే గంటల తరబడిగా ఇబ్బందులు పడుతున్నారు.
రైతులకు అదనపు భారం
మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలను కొనుగోలు చేసే క్రమంలో బస్తాలు సంబంధిత అధికారులే అందించాల్సి ఉంది. అయితే కేసముద్రం మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్‌ను బంద్ చేయడంతో, ఆయా గ్రామాల్లో రైతులే ఒక్కో బస్తాను రూ.25 నుంచి రూ.36 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. 51కేజీల చొప్పున బస్తాల్లో మక్కలను నింపడానికి, కాంటా పెట్టడానికి, ఒక్కో బస్తాకు రూ.30 నుంచి రూ.40లను కూలీలకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలుపుతున్నారు. ట్రాక్టర్ కిరాయి రోజుకు రూ.1,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించాల్సి వస్తుంది. పైగా వేబ్రిడ్జిపై తూకం వేసినందుకు ట్రాక్టర్ లోడ్‌కు రూ.100 చెల్లించి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన షెడ్డు వద్ద మక్కల బస్తాలను ఆన్‌లోడ్ చేసేందుకు, బస్తాకు రూ.2 చెల్లిస్తున్నారు.
గోస పడతానం
మార్క్‌ఫెడ్‌కు మక్కలను అమ్ముకునేందుకు ఇంటివద్దనే కూలీలతో బస్తాలను నింపించి, కాంటా పెట్టించా. బస్తాకు రూ.40 ఇచ్చా ను. ట్రాక్టర్లో 197 బస్తాలను లోడ్ వేసి వేబ్రిడ్జిపై కాంటా వేసేందుకు వస్తే, గంటల తరబడిగా ఎండలో ఉన్నా. మార్క్‌ఫెడ్‌కు అమ్ముకుందామంటే ప్రస్తుతం మార్క్‌ఫెడ్ కొనట్లేదు. అప్పటి వరకు ట్రాక్టర్ కిరాయి కట్టాల్సిందే. ఇప్పటికే ట్రాక్టర్ కిరాయి రూ.5వేల వరకు అయింది.
– రమేశ్, రైతు, బిచ్యానాయక్‌తండా
దారిపొడవునా.. మక్క ట్రాక్టర్లే..
జ్యోతిరావుపూలే సెంటర్ వద్ద ఉన్న వే బ్రిడ్జిపై కాంటా వేసేందుకు అత్యధిక సంఖ్యలో మక్క ట్రాక్టర్లు బుధవారం దారిపొడవునా బారులుదీరాయి. ఒక్కసారిగా అధిక సంఖ్యలో ట్రాక్టర్లు రావడంతో సుమా రు కిలోమీటర్ మేర రోడ్డువెంట ట్రాక్టర్లే కనిపించా యి. రోడ్డుపై వరుసగా ట్రాక్టర్లు నిలిచిఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.
తూకం కోసం వేబ్రిడ్జి వద్ద ట్రాక్టర్ల బారులు
ఆన్‌లైన్ నమోదు కోసమూ పడిగాపులే..


