జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి | - | Sakshi
Sakshi News home page

జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

May 14 2026 6:39 AM | Updated on May 14 2026 6:39 AM

ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క

మహబూబాబాద్‌: జిల్లాను అన్ని రంగాలత్లో అగ్రగామిగా నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, తాగు నీరు, ఇందిరమ్మ ఇళ్లుతోపాటు పలు అభివృద్ధి పనులపై కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లపై మానిటరింగ్‌ కమిటీ, ప్రత్యేక వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేయాలన్నారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరులో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల విషయంలో మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై ప్రారంభించని వారికి నోటీస్‌ ఇవ్వాలని అయినా స్పందించకుంటే రద్దు చేయాలన్నారు. జూన్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన తెలిపారు. అనంతరం ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత తీర్చాలని మంత్రి, రాజ్యసభ సభ్యుడిని కోరారు. డీపీఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తనను బదిలీ చేయాలని కోరారు. ఎంపీ పోరిక బలరాం నాయక్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్‌ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు. సమావేశంలో ఎస్పీ శబరీష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు షురూ

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్‌ విద్యాశాఖ అధికారి సీహెచ్‌.మదార్‌గౌడ్‌ తెలిపారు. జిల్లాలో 13 కేంద్రాల్లో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మొత్తం 1,021 మంది విద్యార్థులకు 956 మంది హాజరయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో 311 మంది విద్యార్థులకు 295 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement