● కలెక్టర్ స్నేహశబరీష్
కురవి: విద్యాభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలకపాత్ర అని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో కురవి హైస్కూల్‌లో బుధవారం కురవి, సీరోలు మండలాల సర్పంచులకు ఒక రోజు శిక్షణ(ఓరిఝెంటేషన్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ పాఠశాలల బలోపేతమే గ్రామాభివృద్దికి పునాది అని స్పష్టం చేశారు. విద్యను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రతీ గ్రామంలో పాఠశాల అభివృద్ధికి సర్పంచ్‌లు ముందుండాలన్నారు. విద్యార్థుల హాజరు, శుభ్రత, భద్రత, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డ్రాపవుట్స్‌ను నిర్మూలించడం సర్పంచుల లక్ష్యం కావాలన్నారు. ఉపాధ్యాయులు, సర్పంచులు, పాఠశాల కమిటీలు, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో నాణ్యమైన విద్యను అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అల్వాల సత్యనారాయణమూర్తి, ఎంఈఓలు బాలాజీనాయక్, ఇస్లావత్ లచ్చిరాంనాయక్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎఫ్‌ఏఓ బానోత్ శంకర్‌నాయక్, సీఎంఓ వంగ సురేష్, ఏఎస్‌సీ సంతోష్, ఎంపీడీఓలు వీరబాబు, మహ్మద్‌గౌస్, హెచ్‌ఎం ఎండీ వహిద్, ఆర్పీలు ప్రవీణ్, శివప్రసాద్, లింగమూర్తి, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.


