● నిందితుడి అరెస్ట్, రిమాండ్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
గీసుకొండ : ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం గీసుకొండ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మనుగొండకు చెందిన తప్పురి ఉదయ్‌శంకర్ గ్రామంలోని ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత సదరు యువతి వివాహం గురించి ప్రశ్నించగా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. ఇటీవల అతను సదరు యువతి ఇంటిలో రాత్రి పూట చొరబడగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించడంతో తాను ఆమెను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలతో కలిసి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై మాట్లాడగా ఉదయ్‌శంకర్, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ బెదిరించారు. ఈ విషయమై బాధితులు మంగళవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
యూరియా కలిపిన నీళ్లు తాగి జీవాలు మృత్యువాత
కురవి : మండల కేంద్రంలోని ఓ రైతుకు చెందిన పామాయిల్ తోటలో యూరియా కలిపిన నీళ్లు తాగి 11 గొర్రెలు, ఒక పోతు మృత్యువాత పడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కురవికి చెందిన తొడుసు వెంకన్న, కాట్యాల వెంకన్న అనే గొర్రెల కాపరులకు చెందిన జీవాలను మేత నిమిత్తం బుధవారం గ్రామ శివారుకు తీసుకెళ్లారు. కురవికి చెందిన కానుగంటి బాబు చెందిన పామాయిల్ తోటలో మేస్తున్నాయి. అయితే ఆ రైతు పామాయిల్ తోటకు యూరియా మందును కలిపి డ్రిప్ ద్వారా అందించేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం తెలియని గొర్రెల కాపరులు ఆ తోటలో జీవాలను మేపుతున్నారు. దాహం వేయడంతో గొర్రెలు పామాయిల్ తోటలోని చెట్ల వద్ద ఉన్న నీటిని తాగాయి. దీంతో 11 జీవాలు అక్కడిక్కడడే మృత్యువాత పడ్డాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు బోరున విలపిస్తూ తెలిపారు. పరిహారం అందజేయాలని కోరారు.


