అమ్మమ్మ చెప్పిన కథ.. | - | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ చెప్పిన కథ..

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

అమ్మమ్మ చెప్పిన కథ..

నారాయణ నమ్మకం..

ఓ గ్రామంలో కిషన్‌ అనే షావుకారి ఉండేవాడు. అతడికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల వివాహం చేసినా.. కిషన్‌ తన సంపాదన, నిల్వ ఉన్న డబ్బులు, బంగారం విషయం మాత్రం ఎవరికీ చెప్పేవారు కాదు. ఇలా చెప్పకుండా ఇంటిలో అటుకుపై సంచిలో డబ్బులు దాచి పెట్టాడు. ఇంతలోనే అనారోగ్యంతో చనిపోయాడు. అతడి కుమారుడు రామయ్య తండ్రి ప్రారంభించిన వ్యాపారం చేసుకుంటున్నాడు. తండ్రి వద్ద సంవత్సరాలుగా పనిచేస్తున్న నారాయణ కుమారుడి వద్ద కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఊరంతా ఇల్లు శుభ్రం చేయడం, రంగులు వేయడం పనిలో నిమగ్నమయ్యారు. రామయ్య కూడా తన ఇంటిని శుభ్రం చేసే పనిని నారాయణకు అప్పగించారు. అటుకు మీద ఉన్న పాత సంచులు, బస్తాలు, సామాన్లు తీసి శుభ్రం చేస్తూ వ్యర్థాలు ఊరు చివరన ఉన్న పాతబావిలో పడేసేవారు. ఇందులో పాత సంచి మూట కట్టి ఉండడంతో బావిలో పడేయకుండా నారాయణ దానిని విప్పి చూశాడు. అందులో నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు కనిపించాయి. దురాశకు పోకుండా ఆ మూటను తన యజమాని రామయ్యకు తిరిగి ఇచ్చేశాడు. దీనిని చూసిన రామయ్యకు కళ్లు చెదిరి పోయాయి. తన వద్ద పనిచేసే నారాయణ నిజాయతీ చూసి సంబుర పడ్డారు. అందులో నుంచి కొన్ని డబ్బులు, బంగారం నారాయణకు ఇచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోయిన నారాయణ నేనేం చేశాను సేటు.. మీ ఇంట్లో ఉన్న మూటను మీకు ఇచ్చా..అంతే కదా అన్నాడు.. కాదు నారాయణ.. రూపాయి దొరికితే ఎవరు చూడకుండా జేబులో వేసుకునే ఈ రోజుల్లో.. లక్షల రూపాయలు, బంగారు ఆభరణాలు నాకు తిరిగి ఇచ్చావు. నీ నిజాయతీకి చేతులు జోడించి దండం పెట్టకుండా ఉండలేక పోతున్నానని మరోసారి చేతులు జోడించి దండం పెట్టాడు రామయ్య.

నీతి : నిజాయతీ పరుడికి దక్కిన సముచిత గౌరవం

మేకల నిక్షిత, 10వ తరగతి, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement