మహబూబాబాద్ రూరల్: వేసవి సెలవుల సందర్భంగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్న తన పిల్లలను చూసేందుకు వెళ్తూ ఓ హమాలీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన మెరుగు ఉపేందర్(34)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉపేందర్ ఖమ్మం పట్టణంలో హమాలీ పని చేసుకుంటూ జీవించేవాడు. ఉపేందర్ అత్తగారి ఇల్లు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామం. వేసవి సెలవుల కోసం పిల్లలు అమ్మమ్మ ఇంటికి వచ్చారు. ఈక్రమంలో పిల్లలను చూడడానికి ఉపేందర్ ఖమ్మం నుంచి తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి గంధంపల్లికి వెళ్తుండగా గాంధీపురం గ్రామం దాటిన తర్వాత ఎదురుగా ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉపేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. రూరల్ బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు హుస్సేన్, బాపూజీ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్ట్‌మార్టం గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని రూరల్ ఎస్సై పి.రాజు తెలిపారు.


