గూడూరు: మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ అనే సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ (జవాన్) శ్రీనగర్‌లో జరిగిన ప్రమాదంలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి జవాన్ భౌతికకాయాన్ని తీసుకురాగా, బుధవారం ఉదయం సీఆర్‌పీఎఫ్ పోలీసు లాంఛనాలతో స్వగ్రామం సీతానగరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీనాయక్, మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత జవాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
శతాధిక వృద్ధురాలి మృతి
పెద్దవంగర: నూరు వసంతాలు దాటి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఒక నిండు ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఎండీ అల్లేమ్మ (106) బుధవారం కాలం చేశారు. కొంత కాలంగా వయో భారంతో బాధ పడుతూ ఆమె తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అల్లేమ్మకు ముగ్గురు కుమార్తెలు ఉండగా.. ఏకంగా 62మంది మనుమలు, మునిమనుమలు ఉన్నారు. నాలుగు తరాలను ఆమె కళ్లారా చూశారు. శతాబ్ధి కాలం పాటు సాగిన ఆమె సుదీర్ఘ ప్రయాణం ముగియడంతో గ్రామస్తులు, బంధువులు ఘన నివాళులర్పించారు.
లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
మహబూబాబాద్ అర్బన్: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీకేజ్‌కి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మునుగాల మహేష్, బోనగిరి మధు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. కార్యక్రమంలో మహేష్, రాజు, బాలు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎంకు రాజీనామా
గార్ల: తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా హరినాయక్ సీపీఎం పార్టీకి, ప్రజాసంఘాల పదవికి రాజీనామా చేస్తున్నట్లు గార్లలో ప్రకటించారు. ఈమేరకు తన రాజీనామా లేఖను బుధవారం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌కు పంపినట్లు తెలిపారు. కొందరు వ్యక్తిగత నిర్ణయాలు పార్టీలో ఆచరించడం నచ్చక పార్టీకీ, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలో రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మున్సిపల్ చైర్‌పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ తెలిపారు. స్థానిక పాతడోర్నకల్‌లో బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, నాయకులు సుమేర్‌చంద్‌జైన్, ఎస్.వెంకటేశ్వర్లు, ఏపూరి రమణయ్య, ఖాదర్‌బాబా పాల్గొన్నారు.
‘పేదింటి కల నెరవేరింది’
కురవి: పేదల ఇంటి కల నెరవేరిందని అయ్యగారిపల్లి సర్పంచ్ జక్కులమాధవినాగన్న అన్నారు. బుధవారం గ్రామంలో సుక్కమ్మరవి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో దొంగల జనార్ధన్‌రెడ్డి, తాడబియిన లింగబాబు, వడ్లకొండ రాములు, బుడిగె రమేష్, గజ్జి అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఉద్యోగం ఇవ్వాలి
గార్ల: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన గార్ల మండలానికి చెందిన పీడీ మాలోత్ మంగయ్య కుమారుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ బుధవారం టీపీటీఎఫ్ సంఘం నాయకులు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ అనురాధకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బాలాజీనాయక్, యాదగిరి, తదితరులు ఉన్నారు.


