బావిలో పడి వృద్ధుడి మృతి
గూడూరు: ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన మండలంలోని గణ్యచకృతండాలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బానోతు దేశ్య (85) మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. రాత్రి వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తండాలోని బంధువుల ఇళ్లలో గాలించారు. బుధవారం ఉదయం నుంచి వెతుకుతుండగా, తండాకు చెందిన ఓ రైతు వ్యవసాయ బావిలో తేలియాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న మృతుడి తండావాసులు మృతదేహాన్ని బయటికి తీయగా, బానోతు దేశ్యగా గుర్తించారు. మలవిసర్జన కోసం నీటికోసం బావి వద్దకు వెల్లిన దేశ్య ప్రమాదవశాత్తు జారి బావిలో పడి ఉంటాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.
చికిత్స పొందుతూ ఎఫ్‌ఏ మృతి
కొత్తగూడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన కార్లాయి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మేడ సుధాకర్(38) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం కిష్టాపురం క్రాస్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మృతుడికి బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హనుమాన్ మాలధారుల ఇరుముడి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బేతోలు గ్రామంలో గల ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వాముల ఇరుముడిధారణ బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో గ్రామానికి చెందిన ముస్లిం భక్తుడు ఖాదర్ బాబా పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా స్వాములకు సేవలు అందించారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రలో బుధవారం నూతనంగా మండల రెడ్డి సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొబ్బిలి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడిగా పర్నేకేశవ రెడ్డి, కార్యదర్శిగా జొన్నగడ్డ అశోక్ రెడ్డి, బొబ్బిలి రంజిత్ రెడ్డి, కోశాధికారిగా అనుమాండ్ల యాకుబ్ రెడ్డిలను ఎన్నుకున్నారు.
పరామర్శ
నెల్లికుదురు: మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన పాశం దేవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎంపీ మాలోతు కవిత పరామర్శించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, మహేందర్, అశోక్, రమేష్, వీరయ్య, మురళీ పాల్గొన్నారు.


