కానరాని టీఫైబర్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

కానరాని టీఫైబర్‌ సేవలు

Mar 30 2026 8:50 AM | Updated on Mar 30 2026 8:50 AM

సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026

కొనసాగుతున్న ఇంటర్‌నెట్‌ ప్రాజెక్టు పనులు

కనెక్షన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం

పలుచోట్ల తుప్పుపడుతున్న పరికరాలు

గ్రామాల్లో అందని ద్రాక్షలా సేవలు

గూడూరు: అతి తక్కువ ఖర్చుతో ప్రతీ పల్లెకు హైస్పీడ్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ ఫైబర్‌ సేవల ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్‌ ద్వారా ఫోన్‌, ఓటీటీ, టీవీ ఇతర సేవలు అందించాలని రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు క్షేత్రస్థాయిలో కనెక్షన్లులు ఇవ్వకపోవడంతో టీ ఫైబర్‌ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.

భూగర్భ కేబుల్‌తో కనెక్షన్లు..

జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద ప్రభుత్వం రెండేళ్ల క్రితం లక్షలు ఖర్చు చేసి టీ ఫైబర్‌ సెట్లను అమర్చింది. వాటికి విద్యుత్‌ సరఫరా కోసం ఖరీదైన సోలార్‌ ప్యానళ్లను కూడా ఏర్పాటు చేశారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్‌వాడీలు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. ఈమేరకు గూడూరు మండలంలో 12 గ్రామ పంచాయతీల్లో టీ ఫైబర్‌ సెట్లతో పాటు సోలార్‌ ప్యానళ్లను బిగించారు. అందులో గూడూరు మండల పరిషత్‌తో పాటు గూడూరు, చిన్న ఎల్లాపురం, భూపతిపేట, వెంగంపేట, కోబల్‌తండా, మర్రిమిట్ట, మచ్చర్ల, బ్రాహ్మణపల్లి, అయోధ్యపురం, బొల్లెపల్లి, రాములుతండా, పడమటితండాలో ఏర్పాటు చేశారు. అదే విధంగా జిల్లాలోని రైతు వేదికల్లో టీ ఫైబర్‌ నెట్‌ ద్వారా టీవీలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ గూడూరు మండలంలో ఒక్క భూపతిపేట రైతు వేదికకు మాత్రమే టీ ఫైబర్‌ నెట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. మిగిలిన జీపీలు, రైతు వేదికల్లో పరికరాలన్నీ దుమ్ముపట్టిపోతున్నాయి. ఇక గూడూరు వంటి మండల కేంద్రంలో కూడా ఈ సేవలకు సంబంధించిన పరికరాలు అలంకారప్రాయంగా మిగిలాయి.

టీ ఫైబర్‌నెట్‌ గ్రిడ్‌తో ప్రయోజనాలు..

భారత్‌ నెట్‌ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఒక ఇంట్లో ఒకే కనెక్షన్‌తో ఫోన్‌, ఇంటర్‌నెట్‌, టీవీ, ఓటీటీ సేవలు పొందవచ్చు. ప్రత్యేక సెటప్‌బాక్స్‌ల ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చని, కీ బోర్డు మౌస్‌ ఉంటే చాలు ప్రత్యేకంగా కంప్యూటర్లు కొనాల్సిన పనిలేదని సమాచారం. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వాడడంతో ఇంటర్‌నెట్‌ వేగం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్‌ క్లాసులు వినడం, హోంవర్క్‌ పనులు సులభంగా చేసుకోవచ్చు.

పేపర్‌ లెస్‌ సేవలకు ఆటంకం

టీ ఫైబర్‌ సేవలు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్‌ లెస్‌) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్‌ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు టీ ఫైబర్‌ కనెక్షన్‌లు ఇచ్చే అవకాశం ఉందని, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement