కురవి: నీరు లేకపోవడంతో మండల కేంద్రం శివారు రేకుల తండాలో వరి పంట ఎండిపోయింది. తండాకు చెందిన రైతు శంకర్ తనకున్న వ్యవసాయ బావి కింద రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగుచేశాడు. బావిలో నీరు అయిపోవడం, పక్కనే ఉన్న కుంట అడుగంటడంతో ఎకరం పొలం ఎండిపోయింది. దీంతో చేసేదేమీలేక పొలంలో మేపేందుకు ఆదివారం గేదెలను వదిలాడు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో ఉన్నత విద్య బలోపేతం
● టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేష్
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలుతో ఉన్నత విద్య బలోపేతం అవుతోందని తెలంగాణ గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, బ్రిజేష్ పేర్కొన్నారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రాథమిక సభ్యుల సంక్షేమం, డిగ్రీ కళాశాలల ఉన్నతి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ఈ సమావేశంలో చందా కాంతయ్య మెమోరియల్ కళాశాల (సీకేఎం) నుంచి ఇటీవల క్రమబద్ధీకరణ పొందిన అధ్యాపకులు మూకుమ్మడిగా సంఘంలో సభ్యత్వం పొందారు. వీరిని రాష్ట్ర కార్యవర్గం సంఘంలోకి ఆహ్వానించింది. అనంతరం వివిధ కళాశాలల అధ్యాపకులకు సంబంధించిన వేతన బకాయిలు, పదోన్నతికి సంబంధించిన అంశాలు, నూతన వేతన సవరణలో ఆమోదయోగ్యమైన ఫిట్‌మెంట్ వంటి అనేక అంశాల పరిష్కారానికి సంబంధించిన తీర్మానాలను ఆమోదించించారు. సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎం.భవాని, అసోసియేట్ సెక్రటరీ అమరేందర్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


