● అసెంబ్లీలో ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్ : ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని బీఆర్‌ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ ఆదివారం మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ అక్రమాలపై వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటుచేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా పోయిందని, మానుకోట జిల్లాలో దళిత, గిరిజనులు, పేద, మధ్యతరగతి కుటుంబాల భూములు కబ్జాకు గురయ్యయాని, ప్రభుత్వ భూముల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని బీఆర్‌ఎస్ నేతలు భూములను తమ పేర్లపైకి మార్చుకున్నారని, దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం తగ్గించేలా ఉందని, వెంటనే వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.


