తొర్రూరు మున్సిపల్‌ ఎన్నిక రసాభాస! | - | Sakshi
Sakshi News home page

తొర్రూరు మున్సిపల్‌ ఎన్నిక రసాభాస!

Feb 17 2026 8:41 AM | Updated on Feb 17 2026 8:41 AM

తొర్రూరు మున్సిపల్‌ ఎన్నిక రసాభాస!

తొర్రూరు మున్సిపల్‌ ఎన్నిక రసాభాస!

పాలకవర్గం ఎన్నిక నేటికి వాయిదా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాహాబాహీ

పాలకవర్గం ఎన్నిక నేటికి వాయిదా

తొర్రూరు : అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల ఆందోళనల నేపథ్యంలో మున్సిపల్‌ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడింది. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డిలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కౌన్సిల్‌కు హాజరయ్యారు. తొలుత మున్సిపాలిటీ కార్యాలయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నాయకత్వంలో ప్రత్యేక బస్సులో బీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది కౌన్సిలర్లు వచ్చారు. వారిని దయాకర్‌రావు మున్సిపాలిటీ వరకు తీసుకుని వెళ్లారు. అంతకుముందే కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్నారు. దయాకర్‌రావు మున్సిపాలిటీ కార్యాలయానికి రావడాన్ని గమనించిన కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అలాగే, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి మున్సిపాలిటీ కార్యాల యం వైపునకు రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆమెను అక్కడి నుంచి పంపించాలని ఆందోళన చేపట్టారు. దీంతో దయాకర్‌రావు, ఝాన్సీరెడ్డి అక్కడి నుంచి నిష్క్రమించారు. అయినా ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి దిగారు. ఎస్పీ శబరీష్‌ రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులను దూరంగా పంపించారు.

ఆందోళనల నేపథ్యంలో ఎన్నిక

నేటికి వాయిదా..

బీఆర్‌ఎస్‌ తరఫున 9, కాంగ్రెస్‌ నుంచి 7 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌ బలం 9కి చేరింది. ఇరువురికి సమానంగా బలం ఉండడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియ మొదలుపెట్టగా కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నిక చేపట్టాల్సిందేనని బీఆర్‌ఎస్‌ పట్టుబట్టింది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కౌన్సిలర్ల ఆందోళనల నేపథ్యంలో ఎన్నిక నేటి (మంగళవారం)కి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ గణేశ్‌ ప్రకటించారు. తొలుత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ 4వ వార్డు కౌన్సిలర్‌ పేర్ల జంపన్న మద్యం లైసెన్స్‌ పొంది ఉన్నాడని.. ఆ విషయం నామినేషన్‌ సమయంలో పేర్కొనలేదని, అతని ఎన్నిక రద్దు చేయాలని కాంగ్రెస్‌ 10వ వార్డు కౌన్సిలర్‌ ముద్దసాని సురేశ్‌, 2వ వార్డు కౌన్సిలర్‌ తూనం శ్రావణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై క్లియరెన్స్‌ తెచ్చుకోవాలని అధికారులు జంపన్నకు సూచించారు. ఎంపీ కడియం కావ్య ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా హాజరవుతుంటే బీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రశ్నించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సమయం మించి పోవడంతో ఎన్నిక ప్రక్రియను నేడు(మంగళవారం) మధ్యాహ్న 12.30 గంటలకు చేపట్టనున్నట్లు ఆర్డీఓ గణేశ్‌ ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement