భక్తులు ప్లాస్టిక్‌ను తీసుకురావొద్దు
హన్మకొండ చౌరస్తా: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను తీసుకురావొద్దని కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ రీజినల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ సునీత విజ్ఞప్తి చేశారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు పర్యావరణహిత జాతరగా జరుపుకునేందుకు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను భక్తులకు తెలియజేసేందుకు ప్రచార, చైతన్య కార్యక్రమాలను కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి జాతరలో పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుతోపాటు కళా బృందాలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ప్లాస్టిక్‌కు బదులు వస్త్ర సంచులు, స్టీల్ గ్లాసులు, ప్లేట్లు వినియోగించాలని సూచించారు. అంతేకాకుండా జాతర జరిగే పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత, జంపన్న వాగులో నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆలయ కల్యాణకట్ట దగ్గర క్షురకులు ఉపయోగించే బ్లేడ్లు, ఆరోగ్య శిబిరాల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వరంగల్‌లోని శుద్ధి కేంద్రాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేశామని ఈఈ సునీత పేర్కొన్నారు.
పర్యావరణహిత మేడారం జాతర
నిర్వహించుకుందాం
కాలుష్య నియంత్రణ మండలి
వరంగల్ రీజినల్ ఈఈ సునీత


