శక్తిని ప్రసాదించే జలకం..
సమ్మక్క తల్లి గుట్ట దిగే సమయం నుంచి గద్దెలకు చేరే వరకు జలకపు వడ్డె మల్లెల సత్యం పూజారులతో కలిసి ముందుకు సాగుతాడు. తొమ్మిది రకాల పానీయాలతో జలకాన్ని ప్రత్యేకంగా పూజారులు తయారు చేస్తారు. ఈ జలకాన్ని సమ్మక్క పూజారుల వడ్డె మల్లెల సత్యం చేతుల పట్టుకుని అమ్మవారిని తీసుకువస్తున్న కృష్ణయ్యతో కలిసి ముందుకు సాగుతాడు. జలకం చల్లితేనే అమ్మవారు ముందుకు కదులుతుంది. అమ్మవారిని తీసుకొచ్చే కృష్ణయ్య ఎక్కడా నీరస పడకుండా జలకాన్ని దప్పికగా అందిస్తారు. దీంతో ఆయన మరింత శక్తిని పుంజుకుని ముందుకు సాగుతాడు.
డోలు దరువుతో తల్లుల యాత్ర షురూ..
సమ్మక్క–సారలమ్మను వారి స్థలాల నుంచి గద్దెలపైకి తీసుకురావాలంటే డోలు దరువు ఉండాల్సిందే. డోలు శబ్దాలు ధ్వనిస్తుంటే పూనకాలతో తల్లుల యాత్ర జోరుగా సాగుతుంది. అమ్మలు వచ్చే తరుణంలో ఒక్క క్షణం ఆగకుండా కళాకారులు డోలు వాయిస్తారు. అలసట లేకుండా కళాకారులు అమ్మవారి శక్తిని ప్రసాదించుకుని వాయిస్తారని పూజారులు చెబుతున్నారు.


