రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని, చిన్ననిర్లక్ష్యం ప్రాణనష్టానికి దారితీస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, రోడ్డు ప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎస్పీ శబరీష్ హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని, ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. హెల్మెట్, సీటుబెల్టు వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి అరైవ్ అలైవ్ సందేశాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, టీఎన్జీఓ సంఘం ప్రతినిధులు, కాళోజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.
అరైవ్.. అలైవ్ సందేశాన్ని ఆచరణలో పెట్టాలి
ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు


