జాతర పనులు త్వరగా పూర్తి చేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం జాతర పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం, మేడారంలో రోడ్ల విస్తర్ణ పనులతోపాటు భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని ఇది లాస్ట్ డెడ్‌లైన్ అని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మంత్రి సీతక్కతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి పనులు, సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్దరణ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలు, గద్దెల ప్రాంగణంలో ఫ్లోరింగ్ పనులు, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం రోడ్ల నిర్మాణం, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు, వాగులో ఇసుక లెవలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం జాతర అభివృద్ధి పనులపై ఆయాశాఖల అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించి జాతర పనుల పురోగతి వివరాలపై ఆరా తీశారు. గద్దెల ప్రాంగణం సాలహారం, గద్దెల విస్తర్ణ, ఆర్చీ ద్వారా స్థంబాల స్థాపన పనుల్లో నెమ్మదిగా సాగుతున్నాయని పూజారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా పొంగులెటి మాట్లాడుతూ.. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులతోపాటు, జాతర అభివృద్ధి పనులన్నీ ఈనెల 30 వరకు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్యను పెంచడంతోపాటు అదనంగా మరో రెండు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్యూలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్శన్ రేగ కల్యాణి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన మంత్రులు పొంగులేటి, సీతక్క
ఈనెల 30 లాస్ట్ డెడ్‌లైన్
అధికారులతో సమీక్ష సమావేశం


