కొడుకు చేతిలో తండ్రి హత్య
గూడూరు: మద్యం మత్తులో గొడవపడిన తండ్రిని కుమారడు కొట్టి చంపిన ఘటన మానుకోట జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ శివారు హఠ్యతండాలో గురువారం అర్ధరాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఠ్యతండాకు చెందిన ధారావత్ నందీరాంనాయక్ (45) భార్యా పిల్లలతో హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నందీరాం గొడవ చేస్తున్నాడు. గొడవ వద్దని చెప్పిన భార్యపై మద్యం మత్తులో రోకలితో దాడి చేయడానికి యత్నించాడు. గుర్తించిన కుమారుడు కృష్ణ అదే రోకలితో తండ్రి ఛాతిపై కొట్టాడు. వెంటనే కింద పడి స్ప్రృహకోల్పోయాడు. కొద్దిసేపటికి గుర్తించిన కుటుంబ సభ్యులు గూడూరు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యుడు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ధారావత్ సోమ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి తెలిపారు.


