ఏకగ్రీవానికి వేలం!
● జోరుగా నామినేషన్లు
హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి గ్రామస్తులు మంగళవారం సమావేశమయ్యాయి.ఈ సందర్భంగా ఎన్నికకు వేలం వేశారు. ఇందులో వచ్చిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చుచేయాలని నిర్ణయించారు. సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు ముందుకొచ్చారు. రూ.10 లక్షల నుంచి రూ.16.50లక్షల వరకు వేలం పాడారు. అయితే చివరికి ఓ అభ్యర్థి తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నామినేషన్ల దాఖలు సంఖ్య ఐదు నుంచి ఆరుకు చేరుకుంది.
బైరాన్‌పల్లిలో కుదరని సయోధ్య..
బైరాన్‌పల్లి సర్పంచ్ పదవి ఏకగ్రీవానికి నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు పూరించారు. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో అదనంగా మరో మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ ఏకగ్రీవానికి స్థానికులు యత్నిస్తున్నట్లు తెలిసింది.
జోరుగా నామినేషన్లు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు కోరుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్‌కే కాకుండా వార్డు సభ్యుల స్థానాలకు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.


