పనికి వెళ్లొస్తూ.. పరలోకాలకు
లింగాలఘణపురం: పనికి వెళ్లొస్తూ ఓ మహిళ పరలోకాలకు వెళ్లింది. ఓవర్ టేక్ చేయబోతూ బైక్.. ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జనగామ–సూర్యాపేట రోడ్డులోని నెల్లుట్ల బ్రిడ్జిపై జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా టంగుటూరుకు చెందిన కళ్లెపు సుజాత (40) తన కూతురు, కుమారుడితో కలిసి ప్రస్తుతం జనగామలో ఉంటూ భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలో తాపీ మేసీ్త్ర శీలం మోహన్‌తో కలిసి పని నిమిత్తం బైక్‌పై వడిచర్లకు వెళ్లింది. పని పూర్తయిన అనంతరం జనగామకు వస్తుండగా నెల్లుట్ల బ్రిడ్జిపై ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తూ అదే వాహనాన్ని ఢీకొన్నారు. ఈఘటనలో సుజాత అక్కడికక్కడే దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను స్థానికులు జనగామ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● ఓవర్ టేక్ చేయబోతూ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్..
● మహిళ దుర్మరణం.. వ్యక్తికి గాయాలు
● నెల్లుట్ల బ్రిడ్జిపై ఘటన


