సందడే.. సందడి..
గెలుపు అవకాశాలపై ఆరా..
కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల హడావిడి మొదలైంది. ఎక్కడ నలుగురు కలిసినా సర్పంచ్, వార్డు సభ్యుల పోటీపైనే చర్చ జరుగుతోంది. మొదటి, రెండో విడత ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సమయం దగ్గర పడింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో వివిధ వర్గాల వారితో మంతనాలు ప్రారంభమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్‌గా బరిలో ఉంటున్నా.. ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. హనుమకొండ జిల్లాలో పలు మండలాల్లో నేటితో రెండు విడతల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ బుధవారం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌తో పోల్చితే జనరల్ స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉంది. వీటిలో అన్ని సామాజిక కులాలకు చెందిన యువకులు పోటీ చేస్తుండడంతో ఓటరు ఎవరికి అనుకూలంగా ఉన్నారో అర్థంగాని పరిస్థితులున్నాయి.
ఉదయం నుంచే ప్రచారం..
ఇప్పటికే గ్రామాల్లో ఉదయం 6 గంటలకే ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి తమను గెలిపించాలని వేడుకుంటున్నారు.
యువత ఆసక్తి..
సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావొస్తోంది. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యువకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో గ్రామ పెద్దలకు అవకాశం ఇచ్చే యువత.. మార్పు కోసమంటూ నేరుగా బరిలోకి దిగేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తమ బంధుమిత్రులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కోరుతోంది. యువతతోనే మార్పు సాధ్యమని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటోంది.
మండలంలోని పలు గ్రామాల్లో ఏఏ గ్రామాల్లో ఏ రిజర్వేషన్ వచ్చింది..ఎవరు పోటీ చేస్తున్నారు.. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆరా తీస్తున్నారు. టీ పాయింట్లలో మొదలు.. ప్రధాన కూడళ్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాల వరకు ఇలా ఏ నలుగురు కలిసినా ఇదే ముచ్చట మాట్లాడుకుంటున్నారు.
జీపీ ఎన్నికలతో పల్లెల్లో కోలాహలం
ఓటర్లకు దగ్గరవుతున్న అభ్యర్థులు
బలాబలాలపై చర్చ
సందడే.. సందడి..


