ఇద్దరు చిన్నారులకు అస్వస్థత..
మరిపెడ రూరల్: అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన ఇద్దరు బాలికలు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి చెందగా మరో బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఇటీవల మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం జీపీ పరిధి ఇటుకలగడ్డతండాలో చోటు చేసుకోగా ఆలస్యంగా మంగళవారం వెలుగుచూసింది. మృత బాలిక తల్లిదండ్రుల భూక్య రవీందర్, రేణుక దంపతుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్య రవీందర్, రేణుక దంపతుల ఏకై క కూతురు చైత్ర (4), అదేవిధంగా భూక్య సురేశ్, నీలమ్మ దంపతుల కూతురు నిత్యతోపాటు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న ఇద్దరు బాలికలు మొత్తం నలుగురు గత నెల 14వ తేదీన అదే తండాలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆయా పెట్టిన వడియాలు తిన్నారు. అనంతరం కొంత సమయం తర్వాత ఆయా వారికి భోజనం వడ్డించింది. ఈ క్రమంలో చైత్ర అస్వస్థతకు గురైంది. గమనించిన నిర్వాహకులు చిన్నారి తండ్రి రవీందర్‌కు సమాచారం ఇవ్వగా ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చూపించి ఇంటికి తీసుకొచ్చాడు. మళ్లీ రాత్రి సమయంలో వాంతులు చేసుకోవడంతో ఆర్‌ఎంపీ సూచన మేరకు మరుసటి రోజు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నీలోఫర్‌కు తరలించారు. పది రోజుల పాటు చికిత్స పొందుతూ గత నెల 29న చైత్ర కన్నుమూసింది. మరో బాలిక నిత్య రెండు రోజుల తర్వాత అంటే గత నెల 16వ తేదీన అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో ఉన్న మరో ఇద్దరు ఐదేళ్ల బాలికలకు స్వల్పంగా వాంతులు కాగా స్థానికంగా చికిత్స పొందారు. అయితే ఈ బాలికలు అస్వస్థతకు గురి కావడానికి కారణం మాత్రం తెలియరాలేదు. దీనిపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాణిని వివరణ కోరగా చైత్ర జాండీస్, లివర్ ఇన్‌పెక్షన్ ఉన్నట్లు రిపోర్ట్‌లో ఉన్నాయని, మరో పాప నిత్య మటన్‌తో వండిన సొలాయ్ తిని జీర్ణం కాకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వీరి అస్వస్థతకు గురి కావడానికి ఇంకేమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతున్న బాలిక మృతి
మరో చిన్నారి పరిస్థితి విషమం
ఇటుకలగడ్డ తండాలో విషాదం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఇద్దరు చిన్నారులకు అస్వస్థత..


