కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు
మల్హర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు నేటితో 26 ఏళ్లు నిండాయి. 1999, డిసెంబర్ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పటి పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంషతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళితో పాటు లక్ష్మీరాజం అనే సాధారణ వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో నక్సలైట్ ముఖ్య నేతలు ప్రాణాలు కోల్పోవడం ఉద్యమానికి తీరని నష్టంగా భావిస్తారు.
ఎన్‌కౌంటర్ నేపథ్యం..
అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూ ర్ అటవీ ప్రాంతంలో 1999 డిసెంబర్ 2న ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డిలు మృత్యువాత పడ్డారు. అప్పటి హోం శాఖ మంత్రి దేవేందర్ గౌడ్, డీజీపీ దొర హెలికాప్టర్‌లో కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించారు.
సిద్ధాంతాలకు ఆకర్షితులై అజ్ఞాతంలోకి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ మండలం కొత్తగుట్టకు చెందిన నల్లా ఆదిరెడ్డి, జగిత్యాలకు చెందిన శీలం నరేష్, వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి ఉన్నత చదువులు అభ్యాసించారు. కన్నవారిని వదిలి నక్సల్స్ సిద్ధాంతాలకు ఆకర్షితమై అజ్ఞాతంలో ఉంటూ ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. అంకిత భావంతో పనిచేస్తూ పార్టీ కేంద్ర కమిటీ నాయకుల స్థాయికి ఎదిగారు. రెండు దశాబ్దాలపాటు విప్లవ ఉద్యమంలో పని చేసిన నాయకులు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. వీరి స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో మావోయిస్ట్‌లు 53 అడుగుల ఎత్తైన స్తూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్ 13న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు.
నల్లా ఆదిరెడ్డి (ఫైల్)
ఎర్రంరెడ్డి
సంతోష్‌రెడ్డి (ఫైల్)
శీలం నరేష్ (ఫైల్)
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు
కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 26 ఏళ్లు


