కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ
వరంగల్ క్రైం : చదివింది ఏడో తరగతి.. చేసేది మోసాలు.. రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నకిలీ ఏసీబీ డీఎస్పీ పేరుతో చలామణి అయిన నిందితుడితోపాటు అతడికి సహకరించిన నలుగురు ముఠా సభ్యులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నిందితుల వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. సత్యసాయి పుట్టపర్తి జిల్లా నల్లమాడ మండలం వేలమద్ది గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాంనగర్ జిల్లా హరోహళ్లీ గ్రామానికి చెందిన నవీన్ జేఆర్, బెంగళూరు, యశ్వంత్‌పూర్‌కు చెందిన మంగళ రవీందర్, మురళి, ప్రసన్న అరెస్టు కాగా సూర్యప్రకాశ్, తాటిమర్రి వేణు, కొత్తకోట రమణ పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్సై దగ్గర డ్రైవర్‌గా పనిచేసి..
ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్ ఓ ఎస్సై వద్ద రెండేళ్లు ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తారనే విషయంపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని వారికి ఏసీబీ డీఎస్పీని అని ఫోన్ చేసేవాడు. ‘మీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవాల్సి ఉంటుంది’ అని బెదిరించేవాడు. ఈక్రమంలో నిందితుడు వరంగల్ జిల్లా రోడ్డు రవాణా శాఖలో ఎంవీఐగా విధులు నిర్వర్తిస్తున్న తుమ్మల జైపాల్‌రెడ్డికి ఫోన్ చేసి ఏసీబీ డీఎస్పీ అని బెదిరించాడు. సుమారు రూ.9.96 లక్షలు వివిధ మార్గాల్లో అతడి నుంచి దోచుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని నిందితుడు శ్రీనివాస్, అతడికి సహకరించిన మరో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు సీపీ తెలిపారు.
రాయలసీమలో నకిలీ పోలీస్‌గా..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రధాన నిందితుడు 2002లో మొదట ద్విచక్ర వాహనం చోరీ చేశాడు. నకిలీ పోలీస్ అధికారిగా అవతారమెత్తి రాయలసీమలో జరిగిన పలు దొంగతనాల్లో అరెస్టు అయిన నిందితుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేశాడు. దొంగసొత్తు దాచి ఉంచారని వారిని బెదిరించి బంగారం, డబ్బు దోపిడీకి పాల్పడ్డాడు. సుమారు 50 కేసుల్లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. జైలు నుంచి విడుదలైన అనంతరం నిందితుడు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, రాయలసీమ ప్రాంతాల్లో 41కి పైగా చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. పోలీసులు మరోమారు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన అనంతరం నకిలీ ఏసీబీ డీఎస్పీగా అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. పలు ఘటనల్లో 19 కేసులు నమోదు కాగా రూ.50 లక్షలు దోపిడీకి పాల్పడినట్లు సీపీ పేర్కొన్నారు. తెలంగాణలో 9 నేరాలు, ఆంధ్రాలో 10 నేరాలకు పాల్ప డి 8 కేసుల్లో అరెస్టయ్యాడు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో మిల్స్‌కాలనీ, స్టేషన్‌ఘన్‌పూర్‌తోపాటు కరీంనగర్, హైదరాబాద్, రాచకొండ, రామగుండం, వికారాబాద్, జగిత్యాల, వనపర్తి, ఏపీలోని కర్నూలులో చేసిన నేరాల్లో 11 కేసులు నమోదు కాగా.. అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
పోలీసుల సహకారంతో చైన్‌స్నాచింగ్
చోరీ చేసిన సొత్తుతో జల్సాలు చేయడం, ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం, గోవాలో క్యాసినో, గోవా, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలకు నిందితుడు వెళ్లినట్లు తెలిపారు. సినిమాటిక్ తరహాలో మోసాలు చేశాడు. పత్రికలు, యాప్ ల ఆధారంగా డబ్బులు వసూలు చేశాడు. పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపే క్రమంలో అనా రోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పోలీసులను మచ్చిక చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పా ల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడికి సహకరించిన 9 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
అధికారులకు అభినందనలు..
ఘరానా మోసగాడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ డి.కవిత, వరంగల్ ఏసీపీ ఎన్.శుభం ప్రకాశ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్లు పవన్‌కుమార్, శ్రీధర్, ఎల్.మంగీలాల్, మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు మహేశ్, ఎం.సురేశ్, టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ సిబ్బందికి పోలీస్ కమిషనర్ రివార్డులు అందజేసి అభినందించారు.
సహకరించిన నలుగురి అరెస్ట్..
ముగ్గురు పరారీ
నిందితుల నుంచి 13 సెల్‌ఫోన్లు స్వాధీనం
ఆన్‌లైన్ గేమ్స్, జల్సాలు, సినిమాటిక్
తరహాలో మోసాలు
వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్


