నాయకులకు పరీక్ష
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
● గ్రామాలపై పట్టు కోసం ప్రయత్నాలు
● ఎమ్మెల్యేలకు సవాల్‌గా జీపీ ఎన్నికలు
● ప్రతిపక్ష పార్టీల్లోనూ అంతే సీరియస్
● ఆచితూచి అభ్యర్థుల ఎంపిక
సాక్షి, మహబూబాబాద్: గ్రామ పంచాయతీల్లో పట్టు ఉంటేనే పార్టీలకు బలం ఉంటుంది. కాగా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు గ్రామ స్థాయిలో ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి. ఇందుకోసం ఎక్కువ మంది మద్దతుదారులను గెలిపించుకునే ప్రయత్నంలో ఇరు పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు.
అధినాయకత్వం నుంచి ఆదేశాలు..
సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన వారికన్నా.. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులకు పరీక్షగా మారింది. అన్ని పార్టీల అధిష్టానాల నుంచి అత్యధిక పంచాయతీలు గెలిపించుకోవాలనే ఆదేశాలు రావడంతో పాటు.. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరుకు నిదర్శనంగా ఈ ఎన్నికలు నిలవనున్నాయి. కాగా, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి సీతక్క గంగారం, కొత్తగూడ మండలాల్లో, ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, మురళీనాయక్, యశస్వినిరెడ్డి, కోరం కనకయ్య తమ నియోజకవర్గాల పరిధిలోని మండల నాయకులతో సమీక్షలు నిర్వహించారు. గెలిచే అభ్యర్థులకే పార్టీ మద్దతు ఇచ్చే విధంగా చూడాలని మండల నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా మాజీ మంత్రి రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మండలాల వారీగా కార్యకర్తల సమావేశాల నిర్వహించి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఈ పంచాయతీ ఎన్నికలతో భర్తీ చేయాలని, అప్పుడే పార్టీ బలం ఏంటో తెలుస్తుందని చెప్పారు. కాగా, అభ్యర్థులకు మద్దతు ప్రకటించే విషయంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
డబ్బులా.. కార్యకర్తలా..
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు సంకట పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తోంది. కాంగ్రెస్ నుంచి అధిక మంది కార్యకర్తలు పోటీలో ఉండడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇబ్బందికరంగా మారింది. అధికారంలో లేనప్పటి నుంచి పార్టీకోసం పనిచేసిన కార్యకర్తలు ఒక వైపు.. పార్టీతో సంబంధం లేకుండా ఉండడం.. ఉన్నా అంటీముట్టనట్లు ఉన్న వారు మరోవైపు మద్దతు అడుగుతున్నారు. దీనికి అనుగుణంగా గ్రామస్థాయిలో కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి.. మద్దతు తెలుపుతున్నారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఆర్థిక పరిస్థితి చూసి కనీసం రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షల వరకు ఖర్చు పెట్టే స్థోమత ఉన్నవారికి మద్దతు ప్రకటిస్తే.. నిజమైన కార్యకర్తలు వెనకబడి పోయే ప్రమాదం ఉంది. అలా అని ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు సర్పంచ్ అభ్యర్థికి ఆర్థిక సహకారం అందించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. డబ్బులు లేకపోతే.. అభ్యర్థి ఓడిపోతాడనే భయం ఒకవైపు.. టికెట్ ఇవ్వకపోతే క్యాడర్ పోతుందనే బాధ మరోవైపు వెంటాడుతోంది. అయితే ఇదేమీ కాదని పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో గ్రామాల్లో డబ్బులకన్నా.. అభ్యర్థి పరిచయాలు, ప్రవర్తనకే ప్రజల మద్దతు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సర్పంచ్ ఎన్నికలు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు పరీక్షగానే ఉంటుందని జిల్లాలో రాజకీయ నాయకులు చెబుతున్నారు.
నియోజకవర్గం మండలాలు పంచాయతీలు వార్డులు
మహబూబాబాద్ 05 155 1,338
డోర్నకల్ 07 185 1,566
ఇల్లెందు 02 49 436
పాలకుర్తి 02 57 468
ములుగు 02 36 302
మొత్తం 18 482 4,110
నాయకులకు పరీక్ష
నాయకులకు పరీక్ష
నాయకులకు పరీక్ష
నాయకులకు పరీక్ష


