విద్యాశాఖకు గ్రహణం
ముడుపుగల్ కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబోసిన ధాన్యం
సాక్షి, మహబూబాబాద్: గత ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి మంచి పేరు దక్కించుకుంది. అయితే ఏడాది తిరగకముందే విద్యాశాఖలో గందరగోళం నెలకొంది. సరిగ్గా పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టే సమయంలోనే డీఈఓ వీఆర్‌ఎస్ తీసుకోవడం జిల్లా విద్యాశాఖలో చర్చగా మారింది. ఉన్న సర్వీస్‌ను సద్వినియోగం చేసుకొని సాఫీగా ఉద్యోగం చేసుకుందామని జిల్లాకు వచ్చిన డీఈఓ దక్షిణామూర్తి మూడు నెలలకే వెనుదిరిగిపోవడం వెనక కారణం ఏమిటనేది చర్చగా మారింది.
మూడు నెలలకు..
మొదటి నుంచి మహబూబాబాద్ విద్యాశాఖ అధికారిగా వచ్చేందుకు సాహసం చేయాల్సి ఉంటుందనే ప్రచారం. ఈమేరకు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన నాగేశ్వర్‌రావు కొద్దికాలంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత వచ్చిన సోమశేఖర శర్మ తనదైన శైలిలో పనిచేసి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన రామారావు పనిచేసిన సమయంలో కార్యాలయంలో గొడవలు లేనిరోజు లేదు. ఈక్రమంలో ఆయనను విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవీందర్ రెడ్డి గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో ఒక వైపు అకాడమిక్, మరోవైపు అడ్మినిస్ట్రేషన్‌ను సరిది ద్దారు. ఆయన ప్రయత్నం ఫలించి గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆయన పదవీ విరమణ పొందడంతో ఖాళీ అయిన డీఈఓ స్థానంలో సరిగ్గా మూడు నెల ల క్రితం సూర్యాపేట ఏడీగా పనిచేసిన దక్షిణామూర్తి బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్దిరోజుల ఉత్సాహంగా పనిచేసిన ఆయన.. తర్వాత జిల్లా నుంచి ఎప్పుడు వెళ్దామనే ఆలోచనలోనే ఉన్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా సర్వీస్ ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకొని సోమవారం వెళ్లిపోయారు. దీంతో ఏడీ రాజేశ్వర్‌రావుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
పని ఒత్తిడి.. సమన్వయ లోపం..
జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి ఉన్నట్టుండి వీఆర్‌ఎస్ తీసుకోవడంపై జిల్లా అధికారుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో నిలవడం.. ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు తీసుకురావాలనే ఒత్తిడి ఉంది. దీనికి తోడు.. కార్యాలయ ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయవడం, సమయపాలన పాటించకపోవడం.. కొందరు కో–ఆర్డినేటర్లు పనిచేయకుండా రాజకీయాలు చేయడం, అత్యవసర సమయాల్లో ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసుకొని ఉండడం, తాము వచ్చిందే సమయం అన్నట్లు కార్యాలయానికి రావడం వంటి సమస్యలు వెంటాడాయి. దీనికి తోడు జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ప్రతీరోజు ఏదో ఒక సమస్య రావడం పరిపాటిగా మారింది. మరోవైపు నాన్‌టీచింగ్ ఉద్యోగుల కొరతతో విద్యార్థులకు సక్రమంగా భోజనం వండి పెట్టకపోవడం, అపరిశుభ్రమైన వాతావరణం, ఇదేంటి అని అడిగితే రాజకీయ పార్టీల నాయకులతో ఫోన్ చేయించి బెదిరించిన సంఘటనలు ఉన్నట్లు ప్రచారం. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం ఎందుకని డీఈఓ వీఆర్‌ఎస్ పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అదనపు బాధ్యతలు తీసుకున్న ఏడీ రాజేశ్వర్‌రావు కూడా డీఈఓ సీటు ముళ్లకిరీటం అని భావించి ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ‘తాను కూడా తల్లి చనిపోయిన బాధలో ఉన్నానని, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల దృష్ట్యా భారం మోయలేను’ అని ఉన్నతాధికారులకు చెప్పిట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితిలో జిల్లా విద్యాశాఖలో నెలకొన్ని సమస్యలు చక్కదిద్దే కొత్త డీఈఓ వస్తారా.. ఇలాగే ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకు రావాల్సి ఉంటుందా అనేది వేచి చూడాలి.
మూడు నెలలకే డీఈఓ వీఆర్‌ఎస్
బాధ్యతలు తీసుకునేందుకు
ఏడీ వెనకడుగు..
పని ఒత్తిడి, ఉద్యోగుల మధ్య
సమన్వయ లోపంతో సతమతం
టెన్త్ పరీక్షల ముందు విద్యాశాఖలో కలకలం


