కేఎంటీపీకి అమెరికా పత్తి బేళ్లు | - | Sakshi
Sakshi News home page

కేఎంటీపీకి అమెరికా పత్తి బేళ్లు

Dec 1 2025 9:34 AM | Updated on Dec 1 2025 9:34 AM

కేఎంటీపీకి అమెరికా పత్తి బేళ్లు

కేఎంటీపీకి అమెరికా పత్తి బేళ్లు

11 శాతం దిగుమతి సుంకం

ఎత్తివేసిన ఫలితం

గీసుకొండ: వరంగల్‌ జిల్లా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు (కేఎంటీపీ)లోని వస్త్ర పరిశ్రమలకు అమెరికా నుంచి పత్తి బేళ్లు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల 13 కంటెయినర్లలో బేళ్లు రాగా.. త్వరలో మరో 15 కంటెయినర్ల బేళ్లు రానున్నట్లు తెలుస్తోంది. అమెరికాతోపాటు పలు దేశాల నుంచి వచ్చే పత్తి బేళ్లపై మన దేశం గతంలో 11 శాతం దిగుమతి సుంకం విధించింది. దీంతో వాటిని దిగుమతి చేసుకోవాలంటే సుంకంతో కలిపి ధర ఎక్కువగా ఉండేది. మన దేశంలో తయారైన బేళ్లను దేశవాళీ పరిశ్రమల అవసరాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. ఇటీవల సుంకం ఎత్తివేయడం ఫలితంగా దేశీయంగా పత్తి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతోందని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీసీఐ ద్వారా ఉత్పత్తి అవుతున్న బేళ్లను కూడా కేఎంటీపీలోని కై టెక్స్‌ లాంటి కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. మన దగ్గర సరిపడా బేళ్లు ఉండగా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం వెనుక నాణ్యతతోపాటు దిగుమతి సుంకం ఎత్తివేయడమే కారణంగా చెబుతున్నారు. సీసీఐ ద్వారా వరంగల్‌తోపాటు జనగామ, బాసర, కేసముద్రం, జమ్మికుంట, మహారాష్ట్ర నుంచి కై టెక్స్‌ కంపెనీ బేళ్లను దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం బేళ్ల నుంచి దారం తీసి ఆ కంపెనీ వస్త్రాలు తయారు చేస్తోంది. అమెరికా నుంచి వచ్చే బేల్‌ ఒక్కొక్కటి సుమారు 230 కిలోల బరువు ఉంటుంది. మన దగ్గర తయారయ్యేవి 170 కిలోల వరకు ఉంటున్నాయి. కేఎంటీపీలోని మరో వస్త్రతయారీ కంపెనీ యంగ్‌వన్‌లో టీ షర్టులను తయారు చేస్తున్నారు. ఇంకా ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తి ప్రక్రియను విస్తరించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో క్యాండీ (358 కిలోల ప్రెసింగ్‌ చేసిన దూది) రూ.51,500 నుంచి రూ. 45 వేల వరకు ఉందని వ్యాపారులు చెబుతున్నారు. విదేశీ సుంకం ఎత్తివేయడం కారణంగా మనతో పోలిస్తే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బేళ్ల ధర తక్కువ ఉండటంతో సహజంగా వస్త్ర కంపెనీలు, స్పిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు వాటి కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 60 వరకు పత్తి మిల్లులు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభమైన అక్టోబర్‌లో 46,500 పత్తి బేళ్లను ఉత్పత్తి చేశారు. గడిచిన 2021–22లో 4,18,600 బేళ్లు, 2022–23లో 5,32,450, 2023–24లో 6,89,635, 2024–25లో 8,31,200 బేళ్లను ఉత్పత్తి చేశారు. వీటిని సాధారణంగా తమిళనాడు, మహారాష్ర, ఆంధ్రప్రదేశ్‌లోని స్పిన్నింగ్‌ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. అవసరాలకు సరిపడా బేళ్లు సీసీఐ ద్వారా రాష్ట్రంలోనే లభిస్తుండగా అమెరికా లాంటి విదేశాల నంచి దిగుమతి చేసుకోవడంతో దేశీయంగా పత్తి సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర రాకుండా పోయే ప్రమాదం ఉందని ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాటన్‌ సెక్షన్‌ అధ్యక్షుడు వీరారావు తెలిపారు.

ఇప్పటికే 13 కంటెయినర్లలో రాక

సీసీఐ నుంచి కూడా టెక్స్‌టైల్‌

పార్కుకు బేళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement