నేటినుంచి ‘బుగులోని’ జాతర..
రేగొండ: భక్తుల కొంగు బంగారం.. రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, జాతర నేటి నుంచి ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభం
మొదటి రోజు తిరుమలగిరి గ్రామానికి చెందిన వంశీయ అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు ఇంటి నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకీలో గుట్టకు చేర్చడంతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం గుట్టపై భాగంలోని గండ దీపంలో నూనె పోసి వెలిగిస్తారు. బుధవారం స్వామి వారికి నిత్య పూజలు, అభిషేకం, ఏనుగు, గుర్రం వాహనాలు తిరుగుట, స్వామి వారికి మెక్కులు తీర్చుకుంటారు. గురు, శుక్ర వారాల్లో నిత్య పూజలు, స్వామి వారికి మొక్కులు, శనివారం స్వామి వారిని గుట్టపై నుంచి తిరిగి అర్చకులు వెంకటేశ్వర్లు ఇంటి వద్దకు చేర్చడంతో జాతర ముగుస్తుంది.
రెండో తిరుపతిగా ప్రసిద్ధి..
బుగులోని వెంకటేశ్వరస్వామి జాతర రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. తిరుపతికి వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తైన కొండలపై వెలసిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన కొండకు చేరుకుంటారు. జాతర ప్రాంగణంలో ఇప్ప చెట్టు చుట్టూ భక్తులు తమ ప్రభబండ్లతో ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఈనెల 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు, ఆలయ కమిటీ


