ఈఎంఐలు చెల్లించలేక బైక్ చోరీలు
జనగామ రూరల్: వాహనాల ఈఎంఐలు చెల్లించలేక బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జనగామ ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ తెలిపారు. సోమవారం జనగామ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా ఆరెగూడానికి చెందిన చెవుల మనోజ్, కేసారానికి చెందిన గొర్ల శివారెడ్డి, కొమ్మాలకు చెందిన ఆరె విజయ్, నెమ్మికల్‌కు చెందిన వీరబోయిన భరత్ స్నేహితులు. వీరు గత నెల 27న తిరుమలగిరి వద్ద కలుసుకున్నారు. ఈ సమయంలో మనోజ్.. శివారెడ్డితో తాను నాలుగు నెలల క్రితం కారు కొనుగోలు చేశానని, దీనికి ప్రతీ నెల ఈఎంఐ చెల్లించడం ఇబ్బంది అవుతోందని చెప్పాడు. అలాగే, శివారెడ్డి కూడా తన బైక్‌ను తెలిసిన వ్యక్తి వద్ద తాకట్టు పెట్టానని, దీనికి వడ్డీ చెల్లించడానికి ఇబ్బంది అవుతోందని చెప్పాడు. దీంతో చోరీలు చేసి అప్పులు చెల్లించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో మిగతా నిందితులు విజయ్, భరత్ కూడా చోరీ చేయగా వచ్చే సొత్తులో తమకు వాటా ఇవ్వాలని కోరడంతో మనోజ్, శివారెడ్డి ఒప్పుకున్నారు. అనంతరం నలుగురు కలిసి కారులో సూర్యాపేట నుంచి జనగామకు చేరుకున్నారు. ఇక్కడ రెండు బైక్‌లను అపహరించిన అనంతరం మనోజ్ వాటిని సూర్యాపేటకు తీసుకెళ్లి తన చిన్నమ్మ ఇంటి వద్ద పెట్టాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు జనగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్సై భరత్ సిబ్బందితో సోమవారం ఉదయం 5 గంటలకు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మళ్లీ చోరీలకు పాల్పడడానికి నలుగురు నిందితులు కారులో జనగామ వస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసి కారు, రెండు బైకులు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 9.50 లక్షలు ఉంటుంది. కాగా, నిందితులపై గతంలో సూర్యాపేట రూరల్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ ఘటనల్లో కేసులు నమోదైనట్లు ఏఎస్పీ తెలిపారు.
నలుగురి అరెస్ట్, రిమాండ్
కారు, రెండు బైకులు, నాలుగు ఫోన్లు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జనగామ ఏఎస్పీ


