విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలి
ఉత్తమ ఫలితాలు సాధించాలి
చిన్నగూడూరు: విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేసి, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు అంగన్‌వాడీ సెంటర్, ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా కేజీబీవీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థుల హాజరు నమోదు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను ఎంఈఓ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. పాఠశాలల్లో తరగతి గదులు, వంటగదులు, స్టోర్ రూంలను పరిశీలించి వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, పాఠ్యాంశాలలోని పలు అంశాలపై విద్యార్థులను ప్రశ్నలను అడిగారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల హాజరు నమోదు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారం వివరాలను అంగన్‌వాడీ టీచర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉగ్గంపల్లి పీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ యాకయ్య, ఎస్‌ఓ లలిత, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అద్వైత్‌మార్ సింగ్
మహబూబాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించి.. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల సామర్థ్యాలను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సి అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించడంతో పాటు అంకితభావంతో పని చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ దక్షిణామూర్తి పాల్గొన్నారు.
విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయాలి


