కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేయొద్దు
● సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుజాత
తొర్రూరు: కుష్టు వ్యాధిని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, స్పర్శ లేని మచ్చలు గుర్తిస్తే చికిత్స తీసుకోవాలని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కుష్టు చికిత్స, శిక్షణా కేంద్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుజాత తెలిపారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. లెప్రసీ క్లినిక్ వైద్యులు సుజాత, సుష్మలు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి నందనాదేవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సుజాత మాట్లాడారు. గ్రామాల్లో లెప్రసీ సర్వే నిర్వహించి బాధితులకు వైద్య సాయం అందించాలన్నారు. శరీరంలో ఉన్న మచ్చలను గుర్తించి లెప్రసీ మందులు అందించాలన్నారు. కుష్టు వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అంగవైకల్యానికి దారి తీస్తుందన్నారు. బహుళ ఔషధ చికిత్స ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు. వైద్యులు మీరాజ్, మానస, సీహెచ్‌ఓ విద్యాసాగర్, డీపీఎంఓలు వనాకర్‌రెడ్డి, విజయ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
క్షుణ్ణంగా పరిశీలించాలి..
దంతాలపల్లి: ప్రభుత్వం నిర్వహించే సర్వేల్లో ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ సుజాత అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి పీహెచ్‌సీ సిబ్బంది, దంతాలపల్లి పీహెచ్‌సీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర లెప్రసీ బృందం సభ్యురాలు సుష్మా, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ విజయకుమార్, డీపీఎం వనాకర్ రెడ్డి, వైద్యురాలు కవిత, సీహెచ్‌ఓలు విద్యాసాగర్, సంజీవరావు, రెండు పీహెచ్‌సీల సూపర్వేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


