
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభం
● నెలరోజుల పాటు శివ,
కేశవ ఆలయాల్లో పూజలు
మహబూబాబాద్ రూరల్: శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. పట్టణంలోని శ్రీఉమాచంద్రమౌళీశ్వరాలయం, పార్వతి రామలింగేశ్వరాలయం, భక్తమార్కండేయ శివాలయం, వేంకటేశ్వరబజార్‌లోని స్వయంభూ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నెలరోజులపాటు కార్తీక మాస పూజలు జరుగనున్నాయి. అదే విధంగా సీతారామ చంద్రస్వామి వారి దేవాలయం, శ్రీవేణుగోపాలస్వామి వారి దేవాలయంలో కూడా కార్తీక మాస పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో శివుడికి భక్తులు వివిధ రకాల అభిషేకాలు చేయిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుందని ఆయా దేవాలయాల అర్చకులు రంగావఝుల సుధాకరశాసీ్త్ర, అన్నావఝుల యుగంధర్ శర్మ, ఎంవీ కృష్ణప్రసాద్, సత్యంగౌతం మహారాజ్ జీ తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం శివాలయాల్లో కార్తీక మాస అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీక మాస ప్రారంభం సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీఆకాశదీపశ్రీ పూజలతో భక్తులకు ఆశీర్వచనాలు అందజేస్తామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ శనివారం నాగుల చవితి పండగ ఉంటుందన్నారు. ఆ రోజున పుట్టల్లో పాలు పోయడం, సుబ్రమణ్యేశ్వరస్వామికి అభిషేకాలు చేయడం శుభసూచకమని తెలిపారు. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో లఘున్యాసపూర్వక, మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి భక్తులు పూజలు నిర్వహించడం ద్వారా వారికి ఉన్న రాహు, కేతు, కుజ దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.