
భార్య కాపురానికి రావడం లేదని..
● మనస్తాపంతో భర్త ఆత్మహత్య
గణపురం: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని నగరంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంగ నరేశ్(35)కు జిల్లా కేంద్రంలోని భాస్కర్‌గడ్డకు చెందిన భాగ్యలక్ష్మితో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరుగడంతో భాగ్యలక్ష్మి తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 19న భార్యను తన ఇంటికి తీసుకురావడానికి నరేశ్ తన అత్తగారింటికి వెళ్లాడు. ఈక్రమంలో ఆమె నిరాకరించడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ ఘటనపై మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం బస్వరాజుపల్లి సమీపంలోని ఓ కుంటలో చేపల పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు నరేశ్ మృతదేహం కనిపించింది. దీంతో వారు తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రేఖ అశోక్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిడి తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.