
టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ
హన్మకొండ: తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కన్వీనర్‌లుగా శ్రీకాంత్, డి.రవీందర్‌రెడ్డిని ఎన్నుకున్నట్లు చైర్మన్ ధరావత్ సికిందర్ మంగళవారం తెలిపారు. కోకన్వీనర్‌గా జి.అనంతరెడ్డి, కో చైర్మన్‌గా టి.తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహేందర్ గౌడ్, కోశాధికారి అటికేటి రవీందర్, చింతలపూడి సతీశ్‌కుమార్ ఎన్నికయ్యారని వివరించారు.
కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–దానాపూర్ మధ్య ఆరు వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
అక్టోబర్ 23, 28వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 24, 29వ తే దీల్లో దానాపూర్–చర్లపల్లి (07092) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 26వ తేదీన చర్లపల్లి–దానా పూర్ (07049) వీక్లీ ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 27వ తేదీన దానాపూర్–చర్లపల్లి (07050) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్తాయి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, త్రిటైర్ ఏసీ, స్లీపర్‌క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో వెళ్లే ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు చర్లపల్లి–దానాపూర్ మధ్య కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, కాట్ని, మహియర్, సంత, ప్రయాగ్‌రాజ్ చోకి, పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
అడవి బర్రె దాడిలో మేకల కాపరి మృతి
కొత్తగూడ: అడవి బర్రె దాడిలో మేకల కాపరి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలో ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18వ తేదీన కార్లాయి గ్రామానికి చెందిన కల్తి గోవిందు(50) మేకలు మేపేందుకు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం మేకలు మాత్రమే ఇంటికి వచ్చాయి. దీంతో గోవిందు కోసం బంధువులు అటవీ ప్రాంతంలో వెతకగా మంగళవారం ఉదయం గోవిందు మృతదేహం కనిపించింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజ్‌కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గోవిందు మృతదేహానికి సమీపంలో అడవి బర్రె పిల్ల పాము కాటుతో మృతిచెంది ఉంది. గోవిందు కడుపు పగిలి పేగులు బయటకు వచ్చి ఉన్నాయి. తన పిల్లకు ప్రమాదం జరిగిందనే కోపంతో అడవి బర్రె దాడి చేసి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పంచనామా నిర్వహించారు.
కారు, బైక్ ఢీ..
● యువతి దుర్మరణం
● మల్కపల్లి వద్ద ఘటన
కన్నాయిగూడెం: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి దుర్మరణం చెందింది. ఈ ఘటన మంగళవారం మండలంలోని సర్వాయి జీపీ పరిధి మల్కపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. మండలంలోని సర్వాయి జీపీ పరిధి చిట్యాల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని బొచ్చక సింధూజ(17) దుస్తులు కొనుగోలు చేయడానికి గ్రామస్తుడు మడె కృష్ణారావు బైక్‌పై ఏటూరునాగారం వెళ్తోంది. ఈ సమయంలో ఇదే మండలం ముప్పనపల్లికి చెందిన నామని మురళి కారులో చిట్యాలకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మల్కపల్లి వద్ద కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సింధూజకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

టీజీ ఎన్పీడీసీఎల్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ