
ఏడేళ్లకే నూరేళ్లు
● నీటిగుంతలో పడి బాలుడి మృతి
నెల్లికుదురు: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఆదివారం జరిగింది. ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉడుత సురేశ్ కుమారుడు సాత్విక్ (7) ఇంటి దగ్గర పిల్లలతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయాడు. గమనించిన సురేశ్ తమ్ముడు అనిల్ కుమారులు హర్ష, హర్ధిక్ తాత వెంకటమల్లుకు తెలిపారు. వెంటనే ఆయన గుంత దగ్గరకు నీటిలోకి దిగి సాత్విక్‌ను బయటకు తీశాడు. అప్పటికే బాలుడు నీటి గుంతలో పడి ఊపిరాడక మృతి చెందాడు. కూలి పనులకు వెళ్లి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.