
కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్: జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాక ముందే వానాకాలం (ఖరీఫ్) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగానే కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ పూర్తి చేసి అన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
242 కేంద్రాలు..
జిల్లాలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 59 కేంద్రాలు, పీఏసీఎస్ 168, జీసీసీ 13, మెప్మా ఆధ్వర్యంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పాత పద్ధతి ప్రకారమే ముందుగా ఏఈఓ తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతనే కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంక్‌ఖాతా పుస్తకం జిరాక్స్‌లను కేంద్రాల నిర్వాహకులకు అందజేయాలి. వారు వివరాలను నమోద్ చేస్తారు. కామన్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,389 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సన్నధాన్యానికి అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్‌ను ప్రభుత్వం అందజేస్తుంది.
సేకరణ లక్ష్యం..
జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, టెంట్, విద్యుత్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగొద్దని కలెక్టర్ హెచ్చరించిన నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు.
శిక్షణ పూర్తి..
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17న ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ట్యాబ్‌లలో నమోదు ఆలస్యం కావొద్దని, కాంటాలు, తరలింపు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ అద్వైత్‌కుమర్ ఈనెల 15,16 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉండడంతో కేంద్రాల విషయంలో ఎలాంటి పొరపాటు జరగొద్దని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. యూరియా కొరతతోనే రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో కొనుగోలు విషయంలో సమస్య రావొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ధాన్యం సేకరణకు త్వరలోనే ఏర్పాట్లు
కొనుగోళ్లపై కలెక్టర్ పలుమార్లు సమీక్షలు
నిర్వాహకులు, ఆపరేటర్లకు శిక్షణ పూర్తి
2,60,000 మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణే లక్ష్యం
అందుబాటులో 28లక్షల గన్నీ బ్యాగులు..
జిల్లాలో 28 లక్షల గన్నీ బ్యాగులు, 10,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో 62 మిల్లులు ఉండగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన వారికి మాత్రమే ధాన్యం తరలిస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంకా మిల్లుల కేటాయింపు జరగలేదు. ప్రధానంగా ట్యాబ్‌లలో నమోదు, కాంటాలు, ధాన్యం తరలింపు, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కాకముందే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.