
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్‌కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్‌లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్‌లో 1,577, వరంగల్ రూరల్‌లో 910, జనగామలో 950, మహబూబాబాద్‌లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం..
వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్‌గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు.
రూ.320.7 కోట్ల టార్గెట్..
2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్‌ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది.
జిల్లాల వారీగా 2023–25, 2025–27 సంవత్సరాల్లో దరఖాస్తులు, ఆదాయం వివరాలు
జిల్లా వైన్స్ 2023–25 ఆదాయం 2025–27 ఆదాయం
దరఖాస్తులు (రూ.కోట్లలో) దరఖాస్తులు (రూ.కోట్లలో)
వరంగల్ అర్బన్ 67 5,859 117 3,012 90.3
వరంగల్ రూరల్ 57 2,938 58 1,826 54.7
జనగామ 50 2,492 49 1,587 47.6
మహబూబాబాద్ 61 2,589 51 1,672 50 .1
భూపాలపల్లి 59 2,161 43 1,657 49.7
మొత్తం 294 16,039 318 9,754 292.4
ఉమ్మడి జిల్లాలో తగ్గిన
వైన్స్ దరఖాస్తుల ఆదాయం
294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ
టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
దరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే..
వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది.

కిక్కు రాలే..!

కిక్కు రాలే..!