
వైద్యం వికటించి మహిళ మృతి
పాలకుర్తి టౌన్: వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని హరిత ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మి(58) గర్భసంచిలో గడ్డ ఉండడంతో పాలకుర్తిలోని హరిత ఆస్పత్రిలో జాయిన్ అయింది. దీంతో వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు బుధవారం రాత్రి గర్భసంచి ఆపరేషన్ చేశారు. గురువారం రాత్రి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యలోనే లక్ష్మి మృతి చెందింది. దీంతో బంధువులు హరిత ఆస్పత్రి వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. కాగా హరిత ఆస్పత్రి వద్ద సీఐ, నలుగురు ఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు మృతురాలి బంధువులతో మాట్లాడి రూ.8 లక్షలు పరిహరం ఇచ్చేలా రాజీకుదిరిచినట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్సై పవన్‌కుమార్‌ను వివరణ కోరగా మృతురాలి భర్త ఆలకుంట్ల ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించినట్లు తెలిపారు. లక్ష్మి మృతికి వైద్యుల కారణం కాదని, కేవలం గుండెనొప్పితో చనిపోయినట్లు భర్త ఉప్పలయ్య ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు .
అర్ధరాత్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట భారీగా పోలీసు బందోబస్తు